Thursday, February 12, 2009

మామా... చందమామా...

నా చిన్నప్పుడు ఒక పున్నమి రాత్రి మాయమ్మ మమ్మల్ని ఒడిలో కూర్చొండబెట్టుకుని చంద్రుని కథ చెప్పింది. వెన్నెలకు ఆ చల్లదనం ఎలా వచ్చింది అనేదే ఆ కథ. చంద్రుడి వెన్నెల చల్లదనం గురించి "చందమామ" మాసపత్రిక అప్పట్లో చెప్పిన మరుపురాని మానవీయ కథ ఇది. ఇక్కడ మా ఊర్లో మా చిన్నతనంలో చందమామ పత్రిక మాకు ప్రసాదించిన జ్ఞానం గురించి కొంత నేపథ్యం తెలుసుకుంటే మంచిదనుకుంటా...

కడప జిల్లా రాయచోటి తాలూకా సుండుపల్లి మండలంలో బాహుదా (చెయ్యేరు) నది దాటితే వచ్చే మా ఊరులో దాదాపు ముప్పై లేదా ముప్పై అయిదేళ్లకు ముందు మా కుటుంబం (నలుగురు అన్నదమ్ములు, వారి పిల్లలు, అవ్వాతాతలు కలిసి 30మంది) మొత్తం ఇంటికొకటి చొప్పున చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి కథల పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకునేది. వాటిని చదవడంలో పెద్దలు, పెదపెద్దలు, పిల్లలు, పినపిల్లలు అంతా పోటీలు పడేవాళ్లం. వ్యవసాయపనుల్లో అందరూ మునుగుతున్నందున ఎవరికి తీరిక ఉంటే వారు కథ చదివితే తక్కినవారి వంతు తర్వాత వచ్చేది.

అయితే ఆ రోజుల్లో సీరియల్‌గా మహాభారతం, రామాయణం, భాగవతం కథలు, భేతాళ కథలు వంటివి వచ్చేవి కాబట్టి ముందుగా చదవని వారు ఈ నెల ఫలానా కథ ఏమైంది అని అప్పటికే చదివిన వారిని అడగటం, వారు యథాశక్తిగా తమ తీరులో కథను చెప్పటం, తర్వాత పుస్తకం వంతులు మారి చేతికొచ్చినప్పుడు మళ్లీ ఆ కథలను చదివి మననం చేసుకోవటం ఇలా మా చిన్నతనంలో -1970-77- ఏళ్ల తరబడి ఈ కథా పారాయణం, పఠనం సాగుతూ వచ్చింది. పుస్తకాన్ని కొని చదివే స్తోమత, సాహిత్య పరిచయం కలిగిన తెలుగు కుటుంబాలకు 60, 70 ల కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చేమో...

ఈ నేపథ్యం నుంచి బయటకి వస్తే చందమామకు ఆ చల్లదనం ఎక్కడినుంచి వచ్చింది.... ఏ మహత్తర క్షణంలో మా అమ్మ చందమామ చల్లదనం గురించి చందమామ పత్రికలో వచ్చిన ఆ వెన్నెల రాత్రి కథను చల్లగా చెప్పిందో కాని ఈ రోజుకూ కథ విన్న ఆ రాత్రినీ, ఆ అనుభూతినీ, అది రేపెట్టిన ఆలోచనలను మర్చిపోలేకున్నానంటే నమ్మండి. చందమామలో ఆ నాడు వచ్చిన, అమ్మ చెప్పిన ఆ చల్లదనపు కథను నేను గుర్తుపెట్టుకున్నంతమేరకు చెబుతున్నా వింటారా.... చదవటం కూడా వినటంతో సమానమే కదా..

సూర్యుడు, వరుణుడు, అగ్ని, చంద్రుడు ఈ నలుగురికీ ఒకే తల్లి అట. అల్లారు ముద్దుగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసిందట.. ఒకరోజు దేవతలలో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతోందట...వీళ్ల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడట. -దేవతలకు పని ఏముంటుంది అని అడగకండి వాళ్ల స్థాయిలో వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా...కంటెంట్ ప్రొవైడర్లకు, లోకలైజర్లకే కాక కార్పొరేట్ ఆఫీసుల్లో ఎడిటర్లకు, మేనేజర్లకు కూడా వాళ్ల స్థాయి పని వాళ్లకున్నట్లు మరి-

పాపం మరి భర్త లేనప్పుడు ఎంత దేవతా స్త్రీ అయితే మాత్రం ఆ సూర్యవరుణాగ్నిచంద్ర మాత తన ఇల్లు విడిచి బయటకు పోవచ్చా మరి. పోకూడదు కదా... అలాగని పెళ్లికి హాజరు కాకపోతే ఆ పెళ్లాడే దేవతా కుటుంబం ముఖం మళ్లీ చూడాలాయె. అందుకన్జెప్పి తాను పోకున్నప్పటికీ తన పిల్లలను ఆ పెళ్లికి పంపించిందామె.

అలా పిల్లలను పెళ్లికి పంపుతూ తల్లి ఒక మాట చెప్పింది. నాయనా... పెళ్లి పందిర్లో ఎవరితో గొడవపడకండి, అల్లరి చేయకుండా, తోటి పిల్లలతో కొట్లాడకుండా పదిమందిలో పేరు తెచ్చుకోండి. మన ఇంటి పేరు నిలబెట్టండి.. ఇలాంటి బుద్ధి మాటలు చెబుతూ చివరలో పెళ్లి విశేషాలను తిరిగొచ్చాక వివరంగా చెప్పమంది. పెళ్లికి పోయినందుకు గుర్తుగా ఏదైనా అక్కడినుంచి తీసుకురమ్మని చెప్పింది.

తల్లి మాటలకు "ఓ" అన్నారు పిల్లలు. తల్లి సాగనంపింది. నలుగురు పిల్లలూ ఏ ఒకరూ తనకు ఎక్కువా కాదు తక్కువా కాదు. పేగు బంధం భేదమెరుగదు కదా..వెళుతున్న పిల్లలకేసి చూస్తూ ఆలోచనలతో ఇంటి మార్గం పట్టింది. మరోవైపు ఈ నలుగురూ పెళ్లికెళ్లారు. మాట ప్రకారం మెత్తగా, ఎవరితో గొడవపడకుండా గడిపారు. ముహూర్తం రాగానే అక్షంతలు చల్లారు. తంతు పూర్తి కాగానే విస్తళ్లు పడ్డాయి. పోటీగా పరుగెత్తి భోజనాలకు కూర్చున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు సుష్టుగా భోంచేశారు. ఇకేముంది తోటి పిల్లలకు వస్తామంటూ చెప్పి బయలుదేరారు.

ఇంటికి రాగానే తల్లి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. పెళ్ళి విశేషాలు నలుగురు పిల్లలనూ అడిగి మరీ తెలుసుకుంది. తర్వాత తీరిగ్గా అడిగింది. "పెళ్లి గుర్తుగా నాకేమన్నా తెచ్చారామ్మా" అంటూ....పెద్దవాడు సూర్యుడు బిక్కచూపులు చూశాడు. నడిపోడు వరుణుడు తేల ముఖం వేశాడు. చిన్నోడు అగ్ని పాలిపోయాడు. అమ్మ చెప్పిన మాట మర్చిపోయారుగా. ఇక కట్టకడపటివాడు చంద్రుడు..తల్లి పిలిచింది. తలమీద చేయివేసి హత్తుకుంది. "నువ్వు కూడా ఏమీ తేలేదామ్మా" అంటూ చిన్నబోయిన స్వరంతో అడిగింది.

"తేకేం.. తెచ్చానమ్మా పెళ్లి భోజనంలో లడ్డూ కారాలు పెట్టారు.. లడ్డు కొంత తిని కొంత ఇదిగో నా గోట్లో పెట్టుకుని తీసుకొచ్చా.." అంటూ గోట్లోంచి తుంపిన లడ్డుముక్క తీసి తల్లి చేతిలో పెట్టాడు. (గోట్లో ఎంత లడ్డుపడుతుంది అని అడగకండి.. అవి దేవతల గోళ్లు..) "తింటూంటే నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకుంటే తింటున్న పక్కవారు చూసి నవ్వుతారు కదా అని పట్టినంత ముక్క గోటిలో పెట్టుకుని తీసుకొచ్చా" అంటూ చెప్పాడు మెత్తగా....

తల్లి గుండె నీరయింది. కంట నీరు చిప్పిల్లింది. మాతృహృదయం ఒక్కసారిగా ఒణికింది. ఆబగా పిల్లాడిని కౌగలించుకుంది. జుట్టు చెరిపింది. సంతోషంతో తల్లి కడుపు సగం నిండిపోయింది. చాలమ్మా.. నువ్వయినా మాట గుర్తు పెట్టుకున్నావు. చెప్పిన మాట నిలబెట్టావు అంటూ మనసారా నవ్వింది. అంతలోనే రోషకషాయిత నేత్రాలతో పెద్దపిల్లలకేసి చూసింది. నిజంగా వణికిపోయారు వాళ్లు. వాళ్లకేసి తీవ్రంగా చూస్తూ ఇలా శపించింది.

"మీరు పెళ్లిలో తిన్నదాంట్లో భాగం అడగలేదురా నేను...తల్లిని నన్ను మర్చిపోవద్దన్నానంతే.. ఏదైనా గుర్తుగా తీసుకురమ్మని చెప్పాను. మరి కనీసం తల్లి మాటను గుర్తు పెట్టుకోలేకపోయారు మీరు. అందుకే తల్లి మనసును బాధించిన మీరు ఎంత మంచిపని చేసినప్పటికీ లోకంచే తిట్లు పడుతూ ఉండండి కలకాలం" అంటూ శపించింది.

పెద్ద కొడుకులకు శాపాల వరాలు పూర్తయ్యాక చిన్నపిల్లాడికేసి చూసింది. "పెళ్లి తీపి తెచ్చినందుకు, తినిపించినందుకు కాదురా.... నా మాట గుర్తుపెట్టుకున్నావు. అంతే చాలు నాకు..తల్లి మనసును సంతోషపెట్టావు. జన్మకిది చాలు.. ఈ క్షణం తల్లిగా నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కలకాలం లోకమంతటికీ పంచెదవు గాక" అంటూ దీవించింది.

ఇంకేముంది ఆ రోజే సూర్యచంద్రాదుల గతులు నిర్దేశించబడ్డాయట. నలుగురూ లోకకళ్యాణంకోసమే పాటు పడుతున్నప్పటికీ ఆ ఆరోజునుంచి తొలి ముగ్గురూ లోకంలో అందరిచేత తిట్లు, శాపనార్థాలు తింటూ ఉండసాగారు. ఎందుకో తెలుసా...

సకల జీవులకు వెలుగునిచ్చే సూర్యుడు మార్తాండావతారమెత్తి ఆయా పనులు చేసుకునే వారికి ఉక్క పుట్టించి చెడతిట్లు తింటాడు గదా... మరి వరుణుడు.....సకల పంటలకూ, ఫలాలకు, ఫలితాలకు కారకుడైనప్పటికీ అడ్డదిడ్డంగా వర్షాలు కురిపించి, తుపానులు పుట్టించి, ఊర్లకు ఊర్లనే లేపుతూ ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ అకాలవర్ష బాధ్యుడిగా, అతివృష్టి కారకుడిగా జనం శాపనార్థాలకు గురవుతుంటాడు గదా..

ఇక పోతే అగ్ని. భూమిని పునీతం చేసే పని. సకల వ్యర్థాలు, చెత్తలను తనలో మరిగించుకుని కొత్త సృష్టికి నాంది పలికే పని. పనికిమాలినదాన్ని ఎంత తగులబెట్టి అరగించుకున్నప్పటికీ, శాపకారణంగా మనుషులకు ఉపయోగపడే వాటిని కూడా లాగించేస్తుంటాడు. ఎంతమంది కొంపలు ఆ రోజునుంచి ఆర్పేశాడని మరి....ఎన్ని ఊళ్లను మటుమాయం చేశాడని...తల్లి శాపం తగిలిన క్షణంలో అడుగుపెట్టిన చోటల్లా భస్మీపటలమే కదా. మరి తిట్లు గాక దీవెనలు దక్కుతాయా...

మరి చంద్రుడూ... సొంత అన్నలు కూడా గమనించనంత జాగ్రత్తగా పెళ్లి లడ్డును తుంపి గోటిలో ఉంచుకుని తెచ్చి తల్లికి ఇచ్చాడు కదా. ఆ అభిమాన బలం ఊరకే పోతుందా మరి..అందుకే తల్లి దీవెన ఫలించి చల్లటి జీవితం దక్కింది. తన ఈ చిన్ని కార్యంతో తల్లిని సంతోషపెట్టిన వాడు, తల్లి మనస్సును చల్లబరచిన వాడు...సమస్త లోకానికే చల్లదనం పంచి ఇచ్చే మహా వరం పొందాడు.

ఆనాటినుంచి ఈనాటిదాకా చంద్రుడు ఎక్కడ అడుగుపెట్టినా చల్లదనం పారాడుతుంది. సమస్త జీవరాశులూ పిండి వెన్నెలను ఆస్వాదించి పరవశిస్తాయి. తల్లి మనసులో చల్లదనం పోసిన చంద్రుడు సూర్యవరుణాగ్నుల అసందర్భ క్రియలనుంచి లోకాన్ని కాపాడి అందరికీ వెన్నెల చల్లదనాన్ని పంచిపెడతాడు...అన్నిటికంటే మించి చంద్రుడి కంటే మించిన సోషలిస్టు, సమానత్వ వాది ఈ ప్రపంచంలోనే దొరకడేమో కదా...

సూర్యుడు బలవంతులనూ ధనవంతులనూ తాకలేడు వేధించలేడు. ప్రాచీన మధ్యయుగాలలో భారీ ఎత్తు మందపు రాతి కట్టడాలు సూర్యుడి బారినుంచి రాజులను చక్రవర్తులను, నిచ్చెన మెట్ల పైభాగంలో ఉన్నవారిని కాపాడితే ఇప్పుడు ఎసి ఉన్న మారాజులు సూర్యుడి వేడిని ఏ మాత్రం లెక్క చేయరు. రాజమందిరాలు, ధనికుల సౌధాలు అప్పుడూ ఇప్పుడూ కూడా వరుణుడి ప్రతాపానికి, మహోగ్నిజ్వాలలకు బెదిరిపోవు, చెదిరిపోవు..

మరి చంద్రుడి విషయానికి వస్తేనో....చంద్రుడు నిజంగా పేదల మనిషి. రాజాంతఃపురాలకంటే ఆకాశ హర్మ్యాల కంటే అపార్ట్‌మెంట్ బతుకులకంటే మిన్నగా చంద్రుడు పేదలపట్లే పక్షపాతం చూపిస్తాడు. చంద్ర వెన్నెల సోయగం నిజంగా పేదల గుడిసెలలోనే తారాడుతుంది. సామాన్యుల ఇళ్లలోనే వెన్నెల తెల్లగా వెల్లివెరుస్తుంది. తాపం బారిన పడే జనాలకు నిజమైన స్వాంతన వెన్నెల చల్లదనం నుంచే లభిస్తుంది. ప్రజల మిత్రులు ఎవరంటే తనకే సాధ్యమైన రీతిలో చల్లదనాన్ని పంచి పెట్టే చంద్రుడి లాంటి వారే కదా.........

అమ్మ కథ ఆపేసింది.... ఆ రాత్రివేళ, ఒక అందమైన స్వాప్నిక ప్రపంచం హద్దుల్లోకి తీసుకు పోయి మమ్మల్ని అక్కడ వదిలేసింది. చల్లదనపు మహత్తు గురించిన అనుభూతిలో మమ్మల్ని ముంచెత్తింది. కథా శ్రవణం నుంచి, పిల్లలకే సాధ్యమైన మంత్రజగత్తులోంచి మెల్లగా లోకంలోకి వచ్చి పడ్డాం. చుట్టూ చూస్తే వెన్నెల.. పిండారబోసినట్లుగా, అమ్మ మనసును సంతోషపెట్టినట్లుగా, తరతరాలుగా, యుగయుగాలుగా ఒకే బాట.. చల్లదనాన్ని లోకంముందు పరుస్తూ పోతూ వెన్నెల..పిండి వెన్నెల....

కధ విన్నది ముగ్గురు పిల్లలం. నోటిమాటలేదు మాకు. మూగబోయాం. ఆ మహిమాన్విత చంద్రకాంతి చల్లదనంలో తడిసి ముద్దయ్యాం. ఆ కథ వినక ముందు మా జీవితాలకు విన్న తర్వాత ఆ క్షణంలో మా జీవితాలకు ఏదో వార..ఏదో అగాథం..ఏదో వ్యక్తావ్యక్తవేదన... స్వప్న, వాస్తవ ప్రపంచాలకు మధ్య ఏదో తేడా. తెలిసీ తెలియని తేడా....ఆ తేడా ఏమిటి అని మేం కొట్టుమిట్లాడుతున్నాం... ఏం చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాని స్థితి.

కథ చెప్పినప్పుడల్లా అమ్మ అడుగుతుంది మమ్మల్ని.. ఆ కథలోని నీతి ఏమిటి అని..దాంట్లోంచి ఏం గ్రహించారు అని. మాకు తెలియని, ఆనాటి మా ఊహకు అందని మాటల్లో మెల్లగా గొణిగాం...అమ్మ మనసును కష్టపెట్టకూడదు ఇదే కదా ఆ కథలో ఉన్న నీతి..ముగ్గురు పిల్లలమూ దీనికే ఓటేశాం. అమ్మ చాలాసార్లు మేం గ్రహించిన కథాసారాన్ని ఖండించో లేక ఇంకాస్త సవరించో దాంట్లోని అసలు విషయాన్ని చివర్లో వివరించేది...

కానీ ఆరోజు అమ్మ ఆశ్చర్యకరంగా మా ఓటు వైపే మొగ్గు చూపింది. అదే ఆకథలోని అసలు నీతి అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లకు అమ్మ మనస్సును అర్థం చేసుకున్నాం, గెలిచాం అని అనుకుంటున్నాం.. ఇంతలో ఉన్నట్లుండి ఒక ప్రశ్న విసిరింది. "తల్లి మనసుకు కష్టం తగలనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా..."

మా పసిహృదయాలకు ఆరోజు అర్థం కాని ప్రశ్న అది. మూగబోయాం.. మాకే తెలియని ఓ కొత్త నిశ్శబ్దం....తన పాతికేళ్ల నవ యవ్వన మాతృ జీవితంలో పొందిన ఏ బాధాకర అనుభవాలు ఆమెను ఆ క్షణంలో ముంచెత్తాయో... ఆ సమయంలో ఆ కథలోని అమ్మ స్థానంలో తానే ఆవహించిందో... తండ్రితో, భర్తతో, మొత్తం సమాజంతో తన హృదయానికి తూట్లు పడిన గాయాల చరిత్రనే ఆరోజు ఆమె అలా ప్రశ్న రూపంలో వెలువరించిందో..

ఇదీ మేము పుట్టిపెరుగుతున్న రోజుల్లో చందమామ పత్రిక మాకు అందించిన గొప్ప మానవీయ కథ. ఆరోజు మేం ఏం చెప్పాలో తెలీని క్షణాల్లో అమ్మను గట్టిగా హత్తుకుని ఆమె మానుంచి ఏ క్షణాల్లో అయినా జారిపోతుందేమో, దూరమైపోతుందేమో అనే భయాందోళనల మధ్య గడిపాం...

కాని ఈ రోజు.. దాదాపు 30 సంవత్సరాలు దాటాక...ఆ తల్లే మాకు దూరమయ్యాక, సమాజం పట్ల కొంచెంగా పెరిగిన జ్ఞానంతో ఆ ప్రశ్నను కాస్త మార్చి ఇలా చెప్పుకుంటే.. "స్త్రీల మనసుకు కష్టం తగులనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా?"

కాస్తంత విశాలంగా ఆలోచిస్తే..... మనిషికి మనిషికి మధ్య భయంకరమైన అగాధాలు, అంతరాలు, వ్యక్తిత్వ హత్యలు, అహంకారాలు, జీవన విధ్వంసాలు పెచ్చరిల్లుతున్న పాడుకాలంలో... మనిషికి ఎందుకు కష్టం తగులుతోంది. మనిషి మనసు ఎందుకు బాధపడుతోంది..అనే ప్రశ్నలోనే పై ప్రశ్నకు కూడా సమాధానం ఉందేమో మరి.

మహిళలకే కాదు, సమాజంలో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేదు. తినడం, సంపాదించడం, చావడమే జీవితచక్రంగా మారి మిగిలిన అన్నివిలువలూ లుప్తమవుతున్న కాలంలో "స్త్రీల మనస్సుకు కష్టం" అనే సమస్య "సమస్త మానవుల కష్టం" అనే మౌలిక సమస్యలోనే దాగి ఉందేమో...

మనిషి జీవితంలో సుఖమే లేదా మరి. అనుబంధాలలో, బాంధవ్యాలలో చల్లదనమే లేదా...చల్లదనాన్ని పంచిపెట్టే గుణమే సమాజంలో హరించుకుపోయిందా.. ఆ తల్లి మొత్తం సమాజానికే ఇంత గాఢమైన ప్రశ్న సంధించి ఉండవచ్చు కాని ఆమె జీవితంలో ఎప్పుడూ ఏ సుఖమూ అనుభవించలేదా... మరీ ఇంత ప్రతికూల ధోరణితో మానవ జీవితంపైనే వ్యాఖ్యానాలు చేయవచ్చా అనే ప్రశ్నలు ఎవరికయినా రావచ్చు...

అయితే మనం మన అవ్వలను, తాతలను, కాటికి సిద్ధంగా ఉన్న కడు వృద్ధులను ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది. నా అనుభవంలో, లోకంలో పుట్టి మహత్కార్యాలు సాధించిన వారు, సాధించకున్నా నిండు జీవితాలను తమ స్థాయిలో తమదైన రీతిలో గడిపి చివరికి మిగిలేదేమిటి అని చివరి పరామర్శకు దిగినవారిని ప్రశ్నించినప్పుడు వారు దాదాపు ఒకేలా సమాధానం ఇచ్చారు.

ఎవరి వద్దకో ఎందుకు తన కూతురు వెళ్లిపోయినా ఇంకా బ్రతికే ఉన్నానంటూ వ్యధ చెందుతున్నప్పటికీ, జీవితసారమిదే, మనం దీనిని భరించాల్సిందే అని చెప్పే మా అవ్వే తన జీవితానుభవాల్లో మానవసారాన్ని ఎత్తి చూపుతుంది. "జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. సుఖపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం అనుకునే క్షణంలోనే ఏదో ఒక కష్టం మనలను వెన్నాడుతుంది, ముప్పుతిప్పలు పెడుతుంది. దాన్ని భరించడమే తప్ప మనం ఏం చేయలేం.." అనే సాంప్రదాయ జీవన తాత్వికతకు మా అవ్వ ప్రతిరూపంగా కనిపిస్తుంది.

మొత్తం మీద మనిషి జీవితంలో చల్లదనం లేదు. మానవ సమాజంలో చల్లదనం లేదు. ఇదే వాస్తవమైతే మనలో, మనందరిలో ఆ చల్లదనాన్ని రకరకాలుగా హరించివేసే ఉష్ణతాపం రగులుతూ ఉన్నట్లే...ఇక్కడ స్త్రీల మనస్సే కాదు, పురుషుల మనస్సే కాదు, వృద్ధుల మనస్సే కాదు లోకంలో బతికే ఎవరి మనస్సు కూడా చల్లదనంతో లేదన్నదే వాస్తవం. మనిషి జీవితం వేడెక్కుతుందో లేదో చూడాలంటే... ముప్పై ఏళ్లక్రితమే వచ్చిన అపరూప చిత్రం "తాతామనవడు" చూడండి చాలు.

ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూంటే ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి.... అదే తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే... ఇదే చెబుతాడు. నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా అంటాడు.

ఇదీ మన జీవితాల్లోని విషాదం, విధ్వంసం, ఉష్ణప్రతాపం. జీవితాల్లో వ్యాపించిన ఈ వేయికోణాల వేడి చల్లబడకుండా, చల్లార్చకుండా మనిషి జీవితం చల్లారుతుందా.. మహిళలకే కాదు ఎవరికైనా చల్లదనం లభిస్తుందా...చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టే ఆ మహిమాన్విత కాలం ఎప్పుడొస్తుందని కాదు.. అందరికీ రావాలని ఆశించడంలో తప్పులేదు కదా.. వెన్నెల చల్లదనాన్ని పంచిపెట్టే ఆ చంద్రుడే మనకు సాక్షి, నిదర్శనం కావాలని భావించడం తప్పు కాదు కదా......

చందమామా వర్థిల్లు...

వెన్నెల చల్లదనమా వర్ధిల్లు.......

(1973లో మా అమ్మ మా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలుకుని ఈ కథ నన్ను జీవితం పొడవునా వెంటాడుతూ వస్తోంది. చందమామ చదవండి జ్ఞానం వస్తుంది అని ఏ మహత్తర క్షణంలో మా నాన్న చందమామను చిన్నప్పుడు మాకిచ్చి చదివించాడో అప్పటినుంచి మా లోకమంతా చందమామకే పట్టం. మా బాల్యాన్ని వెన్నెలతో స్పర్శించిన, పండించిన ఆ చందమామ ఇప్పుడీ నడివయసులో.. నాకు చందమామలోనే ఆన్‌లైన్ ఉద్యోగాన్ని పిలిచి మరీ ఇచ్చింది. పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి.)

2 comments:

  1. chaala chaala manchi post.........alochimpajesaaru............

    inka raayaalani................korukuntooooooo

    ReplyDelete
  2. వినయ్ చక్రవర్తిగారూ,
    క్షమించండి. బ్లాగ్‌స్పాట్.కామ్‌లో ఈ బ్లాగు నిర్వహణ నాకు కాస్త కష్టమనిపించడంతో అప్పట్లోనే blaagu.com/chandamamalu అనే కొత్త బ్లాగు రూపొందించుకుని చందమామ చరిత్రకు సంబంధించిన పలువ్యాసాలు, కథనాలు పోస్ట్ చేస్తూ వచ్చాను. దీంతో మీరు నా ఈ బ్లాగు కథనానికి వ్యాఖ్య పంపిన విషయం కూడా తెలుసుకోలేకపోయాను. నా స్వంతజీవితానికి సంబంధించిన ఈ జ్ఞాపకం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    రాజు.
    చందమామ

    ReplyDelete