Wednesday, April 1, 2009

"చందమామ" అనుభూతులు మరపురానివి"


ఈ రోజు (01-04-09) రాత్రి అనుకోకుండా అంతర్జాలంలో సెర్చ్ చేస్తుండగా సంవత్సరం క్రితం ఓ చందమామ అభిమాని రాసిన కింది బ్లాగులు చూశాను. తెలుగునాడులో ఎంతమంది ఇలా చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆశతో... రామకృష్ణ అనే ఈ బ్లాగర్ రాసిన అమృతమయమైన పలుకులను ఇక్కడ నా బ్లాగ్‌లో చేరుస్తున్నాను. ఇంకా వికీ పీడియా, ఈనాడు, ఈమాట.కామ్ (http://www.eemaata.com/) తదితర పత్క్రికలలో వచ్చిన వ్యాసాలు, చందమామపై పరామర్శలు వంటి వాటని అన్నింటినీ గుదిగుచ్చి నాకు తెలిసిన అందరికీ పంపాలని కలకంటున్నాను.

రాజు.

http://omyfriend.blogspot.com/2008/03/blog-post_6846.html
httpomyfriend.blogspot.com2008_03_01_archive.html

మా ప్రియ మిత్రుడు రాంకీ వలన మన చిననాటి నేస్తం చందమామను గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.ఈ సందర్భంగా చందమామతో నాకున్న అనుబంధాన్ని నెమరువేస్తున్నాను.నా చిన్న తనంలో నాకు పుస్తక పఠనంపై అంతగా ఆశక్తి ఉండేది కాదు. కొబ్బరి మట్టలతో, తాటిటెంకలతో మొదలెట్టిన బంతాట(క్రికెట్) రెండు రూపాయల రబ్బరు బంతి కొని చెక్క బ్యాటుతో ఆడేవరకూ వచ్చింది. బంతి ఉంటే ఏడుపెంకులాట, బ్యాటు కూడా ఉంటే క్రికెట్, రెండూ లేకపోతే చెడుగుడు. ఇలా గడచిపోతున్న కాలంలో ఒకమారు మా సుశీలాబాయి టీచర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండడం చూసాను. వాళ్ళబాయి మధు నా ఈడు వాడు కావడంతో ఇద్దరం కూర్చోని బొమ్మరిల్లు, చందమామ చదివాం. నా చేతిలో చందమామ బొమ్మరిల్లుతో పొలిస్తే కొంచం చిన్నదిగా అనిపించింది, అందుకని వెంటనే పుస్తకాలు మార్చుకుని చూసాను, రెండిటిలో చందమామే బావుందనిపించింది, ఎందుకో తెలియదు. అలా మొదలైన చందమామ పరిచయం కొన్నాళ్ళకి ఆగిపోయింది.
ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా ఒక మిత్రుడు బాలమిత్రలోని ఒక మిని నవల కథ చెప్పాడు. అది ఒక రక్త పిచాచి కధ. అది నిజమో కాదోనని తను ఎక్కడ చవివాడో కనుక్కొని అక్కడకు వెళ్ళాను. అది శాఖా గ్రంధాలయం. బజారు దగ్గరే ఒక హోటల్ పక్కగా ఎవరికి బయటకు కనపడనట్లుగా ఉండేది. ఆ రోజు మొదలు నాలుగు సంవత్సరాలు, ఎనిమిదో తరగతి వరకూ ఒక్క చందమామను కూడా వదల లేదు. ఎప్పుడు కూరగాయల కోసం బజారుకెళ్ళినా అక్కడ కనీసం పావుగంటైనా ఉండాల్సిందే. భేతాళ కథలు, రామాయణం వంటి సీరియల్స్ తో మొదలుకొని , ఒక అయిదారు మూడు పేజీల కథలు, రెండు మూడు పిట్ట కథలు, పాతికేళ్ళనాటి చందమామ కథ, ఒక విదేశీ కథానువాద, వింత వార్తలు, ఇలా సాగేది ప్రస్థానం.
బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటివెన్ని ఉన్నా చందమామ స్దానం చందమామదే!!!
Posted by హరి - HARI at 11:15 AM 0 comments Links to this post
తరాలను తీర్చిదిద్దిన చందమామ మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.
నాలగవ తరగతిలో ఉండగా అనుకుంటాను,ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖాగ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంధాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి. ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు, ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.
చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్తితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి. నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదోహరణంగా వివరిస్తే బాగా అర్దం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కధలలో చేర్చి జనానికి అర్దమ అయ్యే విధంగా రామాయణ, భాగవతాలల రూపంలో చెప్పారు కదా. చదమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది. పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రం లో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు, సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కధాసాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.
చిన్న చిన్న కధల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కధల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ అలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కధల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి " ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను" అని. ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినాకానీ క్రొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.
కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు. నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ. ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.
Posted by రామకృష్ణ బైసాని at 1:54 AM 2 comments Links to this post

2 comments:

  1. చందమామ అనుభూతులు నిజంగా బాగున్నాయి. బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? అందులోనూ చందమామతో కలగలసిన పసితనాన్ని ఎవరూ మరువలేరు. ఈ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన ఏకైక జాతి సంపద, జాతీయ సంపద చందమామ ఒక్కటే కదా...

    ReplyDelete
  2. ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను"
    నిజ్జం మీరు చెప్పింది.
    మీ పోస్ట్ బావుందండి.

    ReplyDelete